నా నాలుగో పెళ్లాం జగనే.. ఒక్క తొక్కు తొక్కకుంటే నా పేరు పవన్ కల్యాణే కాదు..
ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. తాడేపల్లిగూడెంలో టీడీపీ, జనసేన ఉమ్మడిగా జన విజయకేతనం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ ఆవేశపూరిత ప్రసంగం చేశారు. ఇప్పటి వరకూ తనలో శాంతి, మంచితనం మాత్రమే చూశారని.. ఇకపై మరో పవన్‌ని చూస్తారని హెచ్చరించారు. జగన్‌ను పాతాళానానికి తొక్కకుంటే తన పేరు పవన్ కల్యాణే కాదన్నారు. వైసీపీ గూండాయిజాన్ని ఇకపై సహించబోనని.. మక్కెలు విరగ్గొట్టి మడత మంచంలో పడుకోబెడతానని హెచ్చరించారు.
తన పెళ్లిళ్ల గురించి పదే పదే వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై పవన్ ఫైర్ అయ్యారు. మాట్లాడితే మూడు పెళ్లిళ్లు.. రెండు విడాకులు అంటున్నారని.. ఇక జగన్ అయితే ఏకంగా తనకు నాలుగు పెళ్లిళ్లని విమర్శిస్తున్నారని.. తన నాలుగో పెళ్లాం జగనేనన్నారు. ఐదుగురు రెడ్ల కోసం ఐదు కోట్ల మంది తిప్పలు పడుతున్నారన్నారు. యుద్ధాన్ని ఇస్తానని.. మరిచిపోవద్దని జగన్‌ను పవన్ హెచ్చరించారు. మాట మాట్లాడితే తాను సింగిల్.. సింగిల్ అంటున్న తనకు ఉన్న ఒక్కగానొక్క ఎమ్మెల్యేను కూడా లాక్కొన్నారన్నారు. తను జూబ్లీహిల్స్‌లో ఇల్లు కట్టుకున్నప్పటి నుంచి జగన్ సంగతి తనకు తెలుసన్నారు.
40 ఏళ్ల రాజకీయానుభవం ఉన్న చంద్రబాబును జైల్లో వేస్తే చాలా బాధేసిందని.. రాష్ట్ర బాగు కోసమే తాను కూటమిని ప్రతిపాదించినట్టు చెప్పుకొచ్చారు. జనసేన, టీడీపీ నేతలు సహకరించుకుంటే భవిష్యత్ బాగుంటుందని పవన్ చెప్పారు. తెలుగు మీడియంలో చదువుకున్నానని కానీ వైసీపీ నేతల మాదిరిగా మాట్లాడేందుకు సంస్కారం అడ్డువస్తోందని పవన్ తెలిపారు. తనది జగన్‌ను అధ: పాతాళానికి తొక్కే వామనుడి పాదమని.. అలా తొక్కకుంటే తన పేరు పవనే కాదన్నారు. పొత్తులో భాగంగానే 24 అసెంబ్లీ సీట్లు తీసుకున్నానని.. దీనికి కూడా అవతలి పక్షం విమర్శించిందని పేర్కొన్నారు. గాయత్రి మంత్రం కూడా 24 అక్షరాలేనని.. అంకె లెక్క కాదని విపక్షాలకు సలహా ఇచ్చారు. అలాగే తనకు సలహాలు ఇచ్చేవాళ్లు అవసరం లేదని.. యుద్ధం చేసేవాళ్లు కావాలని పవన్ తెలిపారు.