ఎన్నికల కోసం పవన్ ఆస్తులు అమ్ముకుంటున్నారట..
రాబోయే ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆస్తులమ్ముకుంటున్నారా? అంటే సోషల్ మీడియా అయితే అవుననే సమాధానమే ఇస్తోంది. నిజానికి పవన్ కల్యాణ్ అయితే అనుకున్నదొక్కటి.. అవుతున్నది మరొకటి. జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేద్దామని రాజకీయాల్లోకి అడుగు పెట్టారట. ఈ రోజుల్లో అది సాధ్యమయ్యే పనేనా? ప్రపంచం మొత్తం డబ్బు చుట్టూనే తిరుగుతోంది. పాలిటిక్స్‌లో డబ్బు లేకుంటే ఏ పనీ జరగదు. అది పవన్‌కు తెలిసి రావడానికి పెద్దగా సమయమేమీ పట్టలేదు.
అందుకే ఆస్తులను అమ్మేందుకు పవన్ సిద్ధమవుతున్నారట. సినిమాల్లో సంపాదించిన ఆస్తుల్లో కొన్నింటిని అమ్మేసి 100 కోట్ల రూపాయల దాకా ఎన్నికల ఖర్చులకు పవన్ సిద్ధం చేస్తున్నారట. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్‌లో రూ.20 కోట్ల విలువైన స్థలాన్ని అమ్మాలని యోచిస్తున్నారట. తమ పార్టీ తరుఫున పోటీ చేసే అభ్యర్థులను కూడా ఎన్నికల ఖర్చును భరించగలిగే స్తోమత ఉన్న వారినే ఎంపిక చేస్తున్నారట. ఒకవేళ గెలవగలిగిన సత్తా ఉండి డబ్బు లేని అభ్యర్థులు ఎవరైనా ఉంటే వారికి తానే ఖర్చు భరించేందుకు పవన్ సిద్ధమవుతున్నారట.
అలా ఖర్చు భరించలేని అభ్యర్థులకు రూ.20 కోట్ల చొప్పున ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. అయితే దీనికోసం సరిపడా ఫండ్ అయితే జనసేన దగ్గర లేదట. అందుకే ఆస్తులను అమ్మకానికి పెడుతున్నారని టాక్. అలాగే పార్టీ నిర్వహణ కోసం కూడా చాలా ఖర్చు అవుతుంది. దీనికోసం కూడా ఇప్పటికే కొంత డబ్బు పక్కనబెట్టారట. నిజానికి పవన్‌కు ఆస్తుల కంటే అప్పులే ఎక్కువని గతంలో ఆయన బ్రదర్ నాగబాబు కూడా చెప్పారు. రాజకీయాల్లో ఎవరైనా బీభత్సంగా డబ్బు సంపాదించుకుంటారు. పవన్ ఆస్తులు అమ్ముకుంటున్నారన్న వార్త జనాన్ని విస్మయానికి గురి చేస్తోంది.