యాగాల బాటలో తెలంగాణ నేతలు..

యాగాల బాటలో తెలంగాణ నేతలు..

తెలంగాణలో ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. సీఎం కేసీఆర్ రాజశ్యామల యాగం మొదలు పెడతారు. ఇది ఈనాటి తంతు కాదు.. 2014 నుంచి జరుగుతూ వస్తోంది. 2014, 2018లోనూ బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడంతో ఆయన ఈసారి కూడా యాగం నిర్వహించిన మీదటే ఎన్నికల బరిలోకిదిగారు. ఆసక్తికర విషయం ఏంటంటే.. పలువురు నేతలు సైతం ఇప్పుడు ఆయన బాటనే అనుసరిస్తున్నారు. వారిలో బీఆర్ఎస్సే కాదు.. బీజేపీ, కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు.

ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నేతలంతా పోటాపోటీగా యాగాలు నిర్వహిస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, చెన్నూరు నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు రాజశ్యామల యాగం చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు 2014, 2018 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారైనా గెలవాలనే ఆకాంక్షతో రాజశ్యామల యాగం చేశారు. చెన్నూర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ సైతం రాజశ్యామల యాగం చేశారు. 

రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సైతం రాజశ్యామల యాగం నిర్వహించిన వారిలో ఉన్నారు. ఆయన 2014లో బీఎస్పీ నుంచి.. 2018లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈసారి కూడా తనకు ఎదురు లేకుంటే చేసే వారు కాదేమో కానీ కాంగ్రెస్ తరుఫున పోటీ చేస్తున్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆయనకు గట్టి పోటీ ఇస్తున్నారు. దీంతో విజయం సాధించాలని ఇంద్రకరణ్ రెడ్డి రాజశ్యామల యాగం చేశారు. ఇక ఆదిలాబాద్‌ జిల్లా బీజేపీ అభ్యర్థి పాయల్‌ శంకర్‌ సైతం రాజశ్యామల యాగం నిర్వహించారు.