పొత్తు ఉన్నట్టా.. లేనట్టా? పురందేశ్వరి మాటల సారాంశమేంటి?

పొత్తు ఉన్నట్టా.. లేనట్టా? పురందేశ్వరి మాటల సారాంశమేంటి?

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. మరో వారం రోజుల్లో షెడ్యూల్ కూడా వచ్చేస్తుంది. ఇంతవరకూ ఏపీలో పొత్తులు తేలడం లేదు. బీజేపీతో టీడీపీ అధినేత చంద్రబాబు మంతనాలు జరిపి వచ్చి కూడా దాదాపు నెల రోజులవుతోంది. అయినా సరే.. ఇప్పటికీ అతి గతీ లేదు. పొత్తు విషయాన్ని బీజేపీ తేల్చడం లేదు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చేసి పొత్తు ఉంది అంటారు. బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని చెబుతారు. ఆ పార్టీ కోసం కొన్ని సీట్లు తాము త్యాగం చేయాల్సి వచ్చిందని కూడా తెలిపారు.

అయినా సరే.. బీజేపీ తేల్చదే? ఇటు టీడీపీ, జనసేనలనే కాదు.. తమ పార్టీ కేడర్‌ను కూడా బీజేపీ అయోమయంలో పడేస్తోంది. ఈ తరుణంలో ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి నిన్న కొంత సంచలనానికి తెరదీశారు. పొత్తులేమైనా ఉంటే అధిష్టానం చూసుకుంటుందన్నారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీకి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్టు.. దీనికోసం కేడర్‌ను సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు. ఇదే పలు అనుమానాలకు తావిస్తోంది. దీనికోసం నిన్న మీటింగ్ కూడా పురందేశ్వరి నిర్వహించారు.

ఇన్ని రోజులవుతున్నా పొత్తులపై ప్రకటన చేయకపోవడం బీజేపీ నేతలను కూడా గందరగోళంలోకి నెట్టి వేస్తుంటే.. అది చాలదన్నట్టుగా అన్ని స్థానాలకు పోటీ చేసే క్రమంలో కేడర్‌ను సన్నద్ధం చేయడం మరింత విస్మయానికి గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో తాడో పేడో తేల్చుకునేందుకు జనసేనాని పవన్ కల్యాణ్ రేపు హస్తినకు వెళ్లనున్నారని టాక్. బీజేపీతో పొత్తుపై మంతనాలు సాగించనున్నారట. ఈ వ్యవహారమంతా చూస్తుంటే టీడీపీ, జనసేనలతో బీజేపీ పొత్తుకు సిద్ధంగా లేదని తెలుస్తోంది. ఇక రేపు పవన్ ఢిల్లీ వెళితే కానీ ఏదో ఒక క్లారిటీ రాదు.