వనమాకు సుప్రీంలో ఊరట.. ప్రతివాదులకు నోటీసులు

వనమాకు సుప్రీంలో ఊరట.. ప్రతివాదులకు నోటీసులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం బీఆర్ఎస్ నేత వనమా వెంకటేశ్వరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసుపై నేడు విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం హైకోర్టు తీర్పుపై స్టే విధించింది ఎమ్మెల్యే అనర్హతపై వేటు వేసి జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు ఇటీవల తీర్పును వెలువరించింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ వనమా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే హైకోర్టు తీర్పుపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు జారీచేస్తూ.. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. 

అసలేం జరిగిందంటే..

2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం అసెంబ్లీ స్థానం కాంగ్రెస్ పార్టీ నుంచి వనమా.. బీఆర్ఎస్ నుంచి జలగం వెంకట్రావు పోటీ చేశారు. వెంకట్రావుపై 4వేలకు పైగా ఓట్ల తేడాతో వనమా విజయం సాధించారు. అయితే ఎన్నికల అఫిడవిట్‌ వనమాకు చిక్కులు తెచ్చి పెట్టింది. అఫిడవిట్‌లో తన ఆస్తులు, కేసుల వివరాలను పొందుపర్చలేదని, తప్పుడు సమాచారం ఇచ్చినందుకు అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ ప్రత్యర్థి జలగం వెంకటరావు హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి గత నెల 25 వరకూ ఈ కేసులో విచారణ కొనసాగుతూ వచ్చింది. జులై 25న వనమాను అనర్హుడిగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అలాగే జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత రోజునే జలగం వెంకట్రావు.. తీర్పు కాపీని అసెంబ్లీ సెక్రటరీ, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి జలగం అందజేశారు. అయితే పట్టువీడని వనమా తీర్పుపై స్టే కోరుతూ హైకోర్టునే ఆశ్రయించారు. కానీ ఫలితం దక్కలేదు. దీంతో ఆయన నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.