రేవంత్ కీలక నిర్ణయం.. సంతోషంలో ఉద్యమకారులు..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాలు జనాలకు ఎంతగానో నచ్చుతున్నాయి. మెల్లమెల్లగా విమర్శకుల నోళ్లన్నీ కూడా మూతపడుతున్నాయి. మరి ఈ దూకుడును తను అధికారంలో ఉన్నంత కాలం రేవంత్ కొనసాగిస్తారా? లేదా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రజాదర్బార్‌తో ఇప్పటికే జనాలకు బాగా దగ్గరైన రేవంత్.. నేటి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణి కల్పించనున్నారు. నేటి మధ్యాహ్నం 2 గంటల నుంచి తెలంగాణలో మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయవచ్చు.
ఆరు గ్యారెంటీ స్కీమ్‌లో భాగంగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని అమల్లోకి తీసుకురానుండటం విశేషం. ఇక తాజాగా రేవంత్ మరో నిర్ణయం కూడా తీసుకున్నట్టు టాక్ నడుస్తోంది. అదేంటంటే.. ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొందరిపై కేసులు ఎత్తివేసింది కానీ వేలాది మందిని మాత్రం వదిలేసింది. ఉద్యమంలో వేలాది మంది పాల్గొన్నారు. వారందరిపై ఇంకా కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ దిశగా రేవంత్ ఆలోచన చేశారు.
త్వరలోనే ఉద్యమకారులపై కేసులు ఎత్తి వేసేందుకు రంగం సిద్ధమవుతోందని సమాచారం. ఇప్పుడు 2009 నుంచి 2014 జూన్ 2 వరకూ తెలంగాణ ఉద్యమంలో వేల మంది పాల్గొన్నారు. వారిపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకులు కేసులు మోపారు. ఇప్పుడు ఆ ఉద్యమకారులపై నమోదైన కేసులు ఎత్తివేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు అన్ని జిల్లాల ఎస్పీలకు డీజీపీ ఉద్యమకారులకు సంబంధించిన లిస్ట్ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఒక ప్రొఫార్మను కూడా పంపించడం చకచకా జరిగిపోయాయి. రేవంత్ ఈ నిర్ణయంపై ఉద్యమకారుల కుటుంబాల నుంచి సంతోషం వ్యక్తమవుతోంది.