స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు షాక్..

స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు షాక్..

స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు షాక్ తగిలింది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్న తీర్పులను వెలువరించింది. ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ కోర్టుకు రిమాండ్‌ విధించే అధికారం పూర్తిగా ఉందని తేల్చి చెప్పేసింది. ముఖ్యంగా ఈ కేసుకు అవినీతి నిరోధక శాఖలోని సెక్షన్ 17 ఏ వర్తించదంటూ చంద్రబాబు తరుఫు న్యాయవాదులు వాదించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై సుప్రీంకోర్టు ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తంచేశారు.

చీఫ్‌ జస్టిస్‌ నేతృత్వంలోని విస్తృత ధర్మాసనానికి బాబు క్వాష్‌ పిటిషన్‌ను బదిలీ చేసింది. ఓవరాల్‌గా ఇద్దరు న్యాయమూర్తులు కూడా రిమాండ్‌ కొట్టేయలేమని చెప్పడం చంద్రబాబుకు గట్టి చెంపపెట్టు. ఈ కేసుకు సంబంధించి జస్టిస్ బోస్ ఏం తీర్పును వెలువరించారంటే.. ఈ కేసుకు 17 ఏ వర్తిస్తుందని.. బాబు కేసులో విచారణకు ముందే గవర్నర్‌ అనుమతి తీసుకోవాల్సిందని తెలిపారు. గతంలో జరిగిన దర్యాప్తును ఈ అరెస్ట్‌కు వర్తింపజేయడానికి లేదు. అయినా సరే.. బాబుకు విధించిన రిమాండ్‌ ఆర్డర్‌ను కొట్టేయలేమని తేల్చింది. అనుమతి లేనంత మాత్రాన రిమాండ్‌ ఆర్డర్‌ నిర్వీర్యం కాదని జస్టిస్ బోస్ స్పష్టం చేశారు.

జస్టిస్‌ బోస్ తీర్పునకు వ్యతిరేకమైన తీర్పును బేలా త్రివేది వెలువరించారు. ఈ కేసులో చంద్రబాబుకు 17-ఏ వర్తించదని తేల్చి చెప్పారు. 2018లో వచ్చిన సవరణ ఆధారంగా చేసుకుని కేసును క్వాష్‌ చేయలేమని తెలిపారు. 17ఏ సెక్షన్‌ అమలులోకి వచ్చిన తర్వాత చోటు చేసుకున్న నేరాలకు మాత్రమే ఇది వర్తిస్తుందన్నారు. 2018లో వచ్చిన సవరణ కేవలం తేదీకి సంబంధించినది మాత్రమేనన్నారు. అవినీతి నిరోధక చట్టానికి 17ఏను ముడిపెట్టలేమని తేల్చారు స్కిల్‌ డెవల్‌పమెంట్‌ స్కామ్‌ అంతకుముందే చోటు చేసుకుందని ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్‌ రోహత్గీ వాదించారు.  అధికారాన్ని అడ్డుపెట్టుకుని నేరానికి పాల్పడిన వారికి 17ఏ రక్షణగా ఉండకూడదు అని జస్టిస్ బేలా త్రివేది స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇద్దరిలో ఒకరు చంద్రబాబు తరఫు న్యాయవాది వాదనను సమర్థించగా, మరొకరు రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనను అంగీకరించడం గమనార్హం.