తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా.. కారణమేంటంటే..

తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా.. కారణమేంటంటే..

తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై సౌందరరాజన్ నేడు రాజీనామా చేశారు. ఆమె తన రాజీనామా లేఖను నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి పంపించారు. ఒక్కసారిగా ఆమె రాజీనామా చేసినట్టు వార్త గుప్పునమడంతో తెలంగాణలో సంచలనంగా మారింది. అసలు ఎందుకు ఆమె రాజీనామా చేశారు? తెలంగాణలో బీఆర్ఎస్‌తో ఢీ అంటే ఢీ అన్నప్పుడు కూడా తమిళిసై రాజీనామా ఆలోచన చేయలేదు. మరి ఇప్పుడెందుకు ఆమె రాజీనామా చేసినట్టు? అంటే దీనికి కారణం లేకపోలేదు.

తమిళిసై ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆమె చీఫ్‌గా వ్యవహరించినటువంటి తమిళనాడు నుంచే లోక్‌సభకు బీజేపీ తరుఫున పోటీ చేయాలని భావిస్తున్నారు. అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తమిళిసై తన గవర్నర్ పదవితో పాటు  పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పదవికి సైతం రాజీనామా చేశారు. 2019లో తెలంగాణ రాష్ట్రానికి తమిళిసై గవర్నర్‌గా నియమితులయ్యారు. తెలంగాణకుక తొలి మహిళ గవర్నర్ సైతం ఆమే కావడం విశేషం.

ప్రజాదర్బార్, ఫిర్యాదు బాక్స్ వంటివి పెట్టిన తొలి గవర్నర్ తమిళిసైయే కావడం మరో విశేషమని చెప్పవచ్చు. ముఖ్యంగా గత ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పెద్ద ఎత్తున వార్‌కు దిగారు. ఏమాత్రం వెనుకాడుగు వేయకుండా ఢీ అంటే ఢీ అన్నారు. తెలంగాణ గవర్నర్‌గా రావడానికి పూర్వం తమిళిసై తమిళనాడు బీజేపీ చీఫ్‌గా వ్యవహరించారు. ఇప్పుడు అక్కడి నుంచే లోక్‌సభ బరిలోకి దిగనున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా తిరునల్వేలి, కన్యాకుమారిలో ఆమె సొంత సామాజికవర్గమైన నాడార్లు ఎక్కువ. కాబట్టి అక్కడి నుంచి పోటీ చేయవచ్చని సమాచారం.