టీ టైంతో ఎంపీ అభ్యర్థిగా… నక్కతోక తొక్కేశారంతే..
కొందరిని చూసీ చూడగానే నక్కతోక తొక్కారేమో అనిపిస్తుంది. వాళ్ల రాత అంత బాగుంటుంది. వాళ్లకి టైం కూడా అద్భుతంగా కలిసొస్తుంది. రాజకీయాల్లో కొందరు జీవితకాలం పోరాడినా.. జన బలం ఉన్నా కూడా కనీసం ఎమ్మెల్యే టికెట్ కూడా పొందలేరు. కొందరు మాత్రం రాజకీయాల్లో అలా అడుగు పెట్టీ పెట్టగానే అదృష్టం వరిస్తుంది. తాజాగా సిక్కిం బంపర్ లాటరీ లాంటి ఆఫర్ జనసేన నేత, టీ టైం ఉదయ్ శ్రీనివాస్‌ని వరించింది. ఆయన కాకినాడ జనసేన ఎంపీగా ఛాన్స్ కొట్టేశారు.
ఎంపీగా టికెట్ సాధించడమంటే మామూలు విషయం కాదు.. బిజినెస్ టైకూనో లేదంటే రాజకీయాల్లో తలపండిన వారికో ఎంపీ టికెట్ ఇస్తుంటారు. కానీ అతి చిన్న వయసులోనే అది కూడా రాజకీయాల్లో అడుగు పెట్టీ పెట్టగానే వరించడమంటే మామూలు విషయం కాదు. గతంలో మార్గాని భరత్‌కు ఇలాగే బంపరాఫర్ తగిలింది. ఇప్పుడు ఉదయ్ శ్రీనివాస్‌ని. నిజానికి ఉదయ్ శ్రీనివాస్ ఒక సామన్యుడు. ఎనిమిదేళ్ల క్రితం బిజినెస్‌లోకి అడుగు పెట్టి కొంత మేర రాణించారు కానీ అంత పెద్ద వ్యాపారవేత్తగా ఇంకా రాణించలేదు.
ఈ క్రమంలోనే ఆయన పాలిటిక్స్‌లోకి సైతం అడుగు పెట్టారు. జనసేనలోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం జనసేన.. టీడీపీ, బీజేపీల కూటమిలో ఉంది కాబట్టి పొత్తు బీభత్సంగా కలిసొచ్చి ఉదయ్ గెలుపు ఖాయంగానే కనిపిస్తోంది. టైం మరింత కలిసొచ్చి ఉదయ్ విజయం సాధించారో ఆయన దశ తిరిగినట్టే. చిన్న వయసులో ఎంపీగా లోక్‌సభలో అడుగు పెడతారు. ఇప్పటికే పార్టీపై పాజిటివ్ వైబ్స్ బాగానే కనిపిస్తున్నాయి. పైగా ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేనకు పట్టు బాగానే ఉంది. ఇదంతా కలిసొచ్చి ఉదయ్ ఎంపీ అవడం ఖాయమేనంటున్నారు.