Telangana Elections: తెలంగాణలో త్వరలోనే ఎన్నికలు.. ఏర్పాట్లు మొదలు పెట్టిన ఈసీ..
తెలంగాణ ఎన్నికల(Telangana Elections)కు సమయం ఆసన్నమైందన్న విషయం తెలిసిందే. మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల కమిషన్ ఏర్పాట్లలో నిమగ్నమైనట్టు తెలుస్తోంది. గత శాసనసభ ఎన్నికల తేదీనే ప్రామాణికంగా చేసుకొని ఎన్నికలకు ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశాలు చేసిందని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే విషయమై.. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఈసీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. దీనిలో భాగంగానే మరికొన్ని కీలక అంశాలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వికాస్ రాజ్ తెలిపారు.
జీహెచ్ఎంసీ పరిధిలో ఓటరు నమోదు, ఇతర అంశాలకు సంబంధించి రేపు ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు సీఈఓ వికాస్ రాజ్ వెల్లడించారు. కాగా.. కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్ ఎంసీహెచ్‌ఆర్డీలో 33 జిల్లాల ఎలక్టోరల్ ఆఫీసర్లు, డిప్యూటీ డీఈవోలతో ఒక రోజు వర్క్‌షాప్‌ను రాష్ట్రస్థాయిలో ఎన్నికల కమిషన్ నిర్వహించింది. దీనిలో భాగంగా ఈవీఎంల మొదటి దశ తనిఖీపై డీఈఓలకు కేంద్ర ఎన్నికల కమిషన్ అవగాహన కల్పించింది. అలాగే ఈవీఎంలకు సంబంధించి సాంకేతిక అంశాలు, కొత్త సింబల్ లోడింగ్ యూనిట్ ప్రదర్శన వంటి అంశాలను 33 జిల్లాల అధికారులకు కేంద్ర ఎన్నికల కమిషన్ వివరించింది.