ఇంకా ఎంతకాలం బాలినేని అలకలు..?

ఇంకా ఎంతకాలం బాలినేని అలకలు..?

మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మరోసారి అలిగారు. ఆయనకు అలకలేం కొత్తకాదు కానీ ఈసారి ఆయన అలక పార్టీకి ఒకింత నష్టం చేకూర్చేదిగా ఉంది.  ఒంగోలులో ఫేక్ డాక్యుమెంట్స్ స్కాం సంచలనం రేపింది. ఈ  కేసులో పోలీసుల వ్యవహారశైలిపై నిరసనగా బాలినేని తన గన్ మెన్‌లను తిరిగి ప్రభుత్వానికి తక్షణమే సరెండర్ చేస్తున్నట్లు ప్రకటిస్తూ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. ఇది ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. 

అనుకున్నదే తడవుగా నేడు (మంగళవారం) ప్రభుత్వం తనకు కేటాయించిన నలుగురు గన్‌మెన్లను బాలినేని తిప్పి పంపించివేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన ఫేక్ డాక్యుమెంట్స్ కేసులో వైసీపీ నేతలున్నా వదలొద్దని బాలినేని ఎస్పీని కోరారు. అయినా సరే పట్టించుకోకపోవడంతో అందుకు నిరసనగా తన గన్‌మెన్లను వెనక్కి తిప్పి పంపించేశారు. నిజానికి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆదిమూలపు సురేష్‌ను మంత్రిగా కొనసాగించడమే కాకుండా తనను తొలగించినప్పటి నుంచి బాలినేనిపై అసహనం ప్రారంభమైంది.

కొంత కాలం పాటు వైసీపీ కార్యక్రమాలన్నింటికీ బాలినేని దూరంగా ఉన్నారు. ఆ తరువాత సీఎం జగన్ తన వద్దకు పిలిపించుకుని నచ్చజెప్పడంతో తిరిగి పార్టీలో యాక్టివ్ అయ్యారు. ఆ తరువాత సీఎం ఒంగోలు పర్యటన నేపథ్యంలో తనను హెలిప్యాడ్ వద్దకు వెళ్లనివ్వలేదని మరోసారి ఆయన అలకబూనారు. ఆ సమయంలో కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. సీఎంవో అధికారులు నచ్చజెప్పడంతో సభలో పాల్గొన్నారు.

ఇక ఇప్పుడు స్కాం పేరుతో పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. బాలినేని వ్యవహార శైలితో పార్టీ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇక ఎంతకాలం ఈ అలకలని పార్టీ నేతలు బాలినేనిని ప్రశ్నిస్తున్నారు.