తెలంగాణలో అధికారంలోకి వచ్చేదెవరు.. అంతా కన్ఫ్యూజన్!
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, కమలం పార్టీల పెద్దలకు గంట గంటకూ టెన్షన్ పెరిగిపోతోంది. సరిగ్గా ఇదే టైమ్‌లోనే ఒపినీయన్ పోల్స్ అంటూ జాతీయ మీడియా సంస్థలు మొదలుకుని ప్రాంతీయ సంస్థలు కూడా సర్వేలు బయటపెడుతుండటంతో టెన్షన్ కాస్త హైటెన్షన్‌గా మారింది. ఎన్ని సర్వేలు వచ్చినా.. ఎవరెన్ని చెప్పినా కారు గుర్తుకే ఓటు పడుద్ది.. కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారు.. ఎక్కడ చూసినా వినిపిస్తున్న మాట ఇదే.
అయితే.. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ హ్యా్ట్రిక్ కొట్టొద్దని.. కేసీఆర్ ముచ్చటగా మూడోసారి సీఎం పీఠంపైనే కూర్చొనివ్వకూడదని కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది. ఇదిగో అధికారంలోకి వచ్చేశాం అనేలా సీన్ క్రియేట్ చేసేస్తోంది.
ఇక బీజేపీ అయితే.. ఒకప్పుడు బీఆర్ఎస్‌తో ఢీ అంటే ఢీ అనే పరిస్థితి నుంచి ఇప్పుడు ఏ స్థానంలో ఉందో కమలనాథులకే తెలియాలి. శనివారం ఒక్కరోజే ఇండియా టుడే- సీ ఓటర్ సంస్థ, ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ చేసిన సర్వేలు వచ్చాయి. ఇవి రెండూ భిన్నంగానే ఉన్నాయి.
ఇండియా టుడే ప్రకారం..
కాంగ్రెస్ : 54 సీట్లు
బీఆర్‌ఎస్ : 49 సీట్లు
బీజేపీ : 08 సీట్లు
ఓట్ల శాతం :-
కాంగ్రెస్ : 39 శాతం
బీఆర్‌ఎస్ : 38 శాతం
ఇండియా టీవీ సర్వే ప్రకారం..
బీఆర్ఎస్ : 70 స్థానాలు
కాంగ్రెస్ : 34
బీజేపీ : 07
ఎంఐఎం : 07
ఇతరులు : 01
కాగా.. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్-88, కాంగ్రెస్-19, ఎంఐఎం-07, ఇతరులు-04 స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజా వచ్చిన సర్వేల ప్రకారం చూస్తే.. ఇండియా టుడే ప్రకారం కాంగ్రెస్, ఇండియా టీవీ ప్రకారం చూస్తే.. బీఆర్ఎస్‌దే అధికారం అని తేలిపోయింది. ఒక సర్వేకు.. మరో సర్వేకు అస్సలే పొంతన లేదు.. కాస్త అటు ఇటు రావచ్చు కానీ.. సగానికి సగం తగ్గిపోవడం అంటే ఇదేం విచిత్రమో మరి. అసలు ఏ పార్టీ గెలుస్తుంది..? ఏ పార్టీకి ఓటేయాలనే డైలామాలో ఓటరు ఉన్నారట. మరోవైపు.. వరుస సర్వేలతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పెద్దల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట. అభ్యర్థులను ప్రకటించడం, మేనిఫెస్టో, బీఫామ్‌లతో సారు ‘కారు’ మంచి జోరు మీదుండగా.. కాంగ్రెస్ మాత్రం మొదటి జాబితా ప్రకటించి.. రెండో జాబితా రిలీజ్ చేయడానికి మంచి ముహూర్తం కోసం వేచి చూస్తోంది. ఇక బీజేపీకి ఇంతవరకూ ఆ ఊసే ఎత్తలేదు. ఫైనల్‌గా ఏ పార్టీకి ప్రజలు పట్టం కడతారో.. ఎవర్ని సీఎం సీటులో కూర్చోబెడతారో చూడాలి మరి.