KCR: కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అయి చరిత్ర సృష్టిస్తారా?

కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అయి చరిత్ర సృష్టిస్తారా?

ఈ సారి కూడా ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తే.. హ్యాట్రిక్ సీఎం అవుతారు గులాబీ బాస్ కేసీఆర్. నిజానికి దక్షిణాదిన మూడు సార్లు సీఎంలు అయిన వాళ్లున్నారు కానీ వరుసబెట్టి మూడుసార్లు గెలిచి సీఎం పదవి చేపట్టిన వారైతే లేరు. ఉత్తరాదిలో అయితే 20 ఏళ్లకు పైబడి సీఎం పదవిని అలంకరించిన వారు ఉన్నారు కానీ దక్షిణాదిలో అయితే లేరు. సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్‌ కుమార్‌ చామ్లింగ్‌.. 24 ఏళ్లకు పైగా సీఎం పదవిలో ఉంటే.. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, పశ్చిమ బెంగా మాజీ ముఖ్యమంత్రి జ్యోతి బసు 23 ఏళ్ల చొప్పున సీఎంగా కొనసాగారు. దక్షిణాదిలో అయితే ఇప్పటి వరకూ హ్యాట్రిక్ సీఎంలు అంటూ ఎవరూ లేరు. ఈ సారి గెలిస్తే ఆ ఫీట్ సాధించిన తొలి సీఎం కేసీఆర్ అవుతారు.

ప్రత్యామ్నాయం లేకే..

Advertisement

వరుసగా రెండు సార్లు సీఎంలు అయిన నేతలైతే దక్షిణాదిలో చాలా మందే ఉన్నారు. వరుసగా మూడోసారి అదృష్టమైతే ఎవరినీ వరించలేదు. బీఆర్ఎస్ ఈ సారి కూడా గెలిచిందో దక్షిణాదిన కేసీఆర్ కొత్త చరిత్ర సృష్టించిన వారవడం ఖాయం. మరి ముచ్చటగా మూడోసారి ప్రజలు ఆయనకు అవకాశం ఇస్తారా? అనేదే మిలియన్ డాలర్ క్వశ్చన్. కర్ణాటక ఎన్నికలకు ముందు ఒక లెక్క.. ఇప్పుడో లెక్క. నిజానికి ధీటైన ప్రత్యామ్నాయం లేకే జనం కేసీఆర్‌కు జై కొడుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ రూపంలో వచ్చేసింది. మరి అధికారాన్ని దక్కించుకునేంత సీన్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిందా? లేదా? అనేదే తెలియాల్సి ఉంది. ఇక కేసీఆర్ అయితే గత రెండు ఎన్నికలకు భిన్నంగా ఈసారి రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయడం ఇంట్రెస్టింగ్‌గా మారింది.

కేసీఆర్ సరికొత్త నిర్ణయం.. 20 మందిని మార్చేస్తారట..

అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్..

నిజానికి తమిళనాట నాయకులను దేవుళ్ల మాదిరిగా తలుస్తారు. వారికోసం ఏం చేయడానికైనా సిద్ధమవుతారు. అలాంటి చోటే ఏ నాయకుడికీ హ్యాట్రిక్ కొట్టడం సాధ్యం కాలేదు. అందుకే బీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికను తీసుకుంది. మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికను అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ దాదాపు ఎన్నికల సమయం వరకూ తెలంగాణలో మకాం వేయాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక గతంలో పార్టీలో కుమ్ములాటలు ఉన్నాయి కానీ ప్రస్తుతం పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా నేతలంతా కలిసి పని చేస్తున్నారు. ఇప్పటికే జనంలోకి వెళ్లి ప్రచారం కూడా మొదలు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమైపోయారు. ఇక మరి హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్‌క చరిత్ర పుటల్లో నిలుస్తారో లేదో చూడాలి.