అసలిలాంటి ఫలితాలను ఊహించలేదు… చంద్రబాబు,పవన్ లకు శుభాకాంక్షలు: జగన్

అసలిలాంటి ఫలితాలను ఊహించలేదు: జగన్

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏపీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తొలిసారిగా మీడియా ముందుకు వచ్చారు. ఆయన ఒకింత ఆవేదనతో కనిపించారు. ప్రజలకు తానెంతో చేశానని అదంతా ఏమైందో తెలియదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి చేసినా ఓటమి పాలయ్యామని తెలిపారు. ప్రతి ఒక్కరికీ ఎంతో చేశామని అదంతా ఏమైందో తెలియదన్నారు. అక్క చెల్లెమ్మల ఓట్లు ఎటు పోయాయో తెలియదన్నారు. 53 లక్షల మంది తల్లులకు మంచి చేశామన్నారు. కోటి ఐదు లక్షల మంది అక్కా చెల్లెమ్మలకు మంచి చేశామని.. వాళ్ల కష్టాల్ని మా కష్టాలుగా భావించామని జగన్ తెలిపారు. చదువుల్లో ఎన్నడూ చూడని మార్పులు తీసుకొచ్చామన్నారు. అవ్వ తాతలకు చేసిందేమైందో అర్థం కాలేదన్నారు. 

ఆ అభిమానం ఏమైందో తెలియదు..

26 లక్షల మంది అవ్వాతాతలు, వృద్ధులు, వికలాంగులకు.. గతంలో ఎప్పుడూ జరగని విధంగా మంచి చేశామని జగన్ తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన.. చాలీచాలని పెన్షన్‌ నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేశామన్నారు. విద్యార్థులకు నాణ్యమైన చదువు.. రిక్షా కార్మికులను ఆదుకోవడం వంటివన్నీ ఏమయ్యాయో తెలియదన్నారు. చదువుల్లో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చామని.. ఆ పిల్లలు, ఆ తల్లుల అభిమానం ఏమైందో తెలియదని జగన్ ఆవేదనతో మాట్లాడారు. మంచి చేసినా ఓటమి పాలయ్యామన్నారు. అసలు ఇలాంటి ఫలితాలను తాను ఊహించలేదని జగన్ అన్నారు. ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యాన్ని కలిగించాయని జగన్ పేర్కొన్నారు.

పోరాటాలు కొత్త కాదు..

ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లకు అండగా ఉన్నామని.. వాళ్లకు వాహనమిత్ర ఇచ్చామని జగన్ తెలిపారు. మత్స్యకార భరోసా, నేతన్న చేయూత అందించామన్నారు. మేనిఫెస్టో అంటే బైబిల్‌, ఖురాన్‌, భగవద్గీతలా భావించామని జగన్‌ తెలిపారు. రైతన్నలకు ఎంతగానో తోడుగా నిలిచామని.. అన్నదాతలకు రైతు భరోసా అందించామన్నారు. ‌అర కోటి మంది రైతుల ప్రేమ ఏమైందో తెలియదన్నారు. పేదవాళ్లకు తోడుగా ఉన్నామన్నారు.  జగన్‌ ప్రతిపక్షంలో ఉండటం కొత్త కాదని.. పోరాటాలు చేయడం కొత్త కాదని స్పష్టం చేశారు. తాను ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని.. అంతకు మించిన కష్టాలు ఇక ఉండబోవని జగన్ అన్నారు. ప్రజల తీర్పును గౌరవిస్తామని.. ధైర్యంగా ముందడుగు వేస్తామన్నారు. టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు,పవన్ కల్యాణ్‌లకు శుభాకాంక్షలు తెలిపారు.

Google News