బీసీలకు పెద్దపీట… జగన్ మార్క్ ఇదే!

బీసీలకు పెద్దపీట… జగన్ మార్క్ ఇదే!

వైనాట్ 175 అన్న నినాదంతో ఏపీ సీఎం జగన్ దూసుకెళుతున్నారు. నిత్యం ప్రజల్లో ఉండాలంటూ పార్టీ కార్యకర్తలకు సైతం ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఏదో ఒక కార్యక్రమాన్ని రూపొందించి వైసీప ప్రజాప్రతినిధులంతా నిత్యం జనాల్లో ఉండేలా చూస్తు్న్నారు. ఇక తుపాను బాధిత రైతులను పరామర్శించి జగన్ ఓ మెట్టు ఎక్కేశారు. ప్రతి విషయంలోనూ ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. తాజాగా వైసీపీలో కీలక మార్పులు చోటు చేసుకుంటుండటమే దీనికి నిదర్శనం. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా సంచలన నిర్ణయాలకు సీఎం జగన్ తెర తీస్తున్నారు. ఈ క్రమంలోనే జనాభాలో పెద్ద సంఖ్యలో ఉన్న బీసీలకు ఈసారి పెద్ద పీట వేయాలని యోచిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఏపీలో మొత్తం పదకొండు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇన్‌చార్జులను మారుస్తూ వైసీపీ అధినాయకత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. కొందరు సిట్టింగ్‌ల స్థానంలో కొత్తవారు.. మరికొందరు సిట్టింగులకు స్థాన మార్పిడి జరిగింది. బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే క్రమంలోనే ఈ మార్పులు చేర్పులు చేపట్టినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పని తీరును సైతం పరిగణలోకి తీసుకుని ఈ మార్పులు చేయడం జరిగిందని పార్టీ నేతలు చెబుతున్నారు. కేసీఆర్ సిట్టింగులకు ప్రాధాన్యమిచ్చి దెబ్బతిన్నారు. గతంలో జగన్ కూడా సిట్టింగ్‌లకే ప్రాధాన్యమన్నారు కానీ తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత తన అభిప్రాయాన్ని మార్చుకున్నారట.

ప్రజామోదం ఉన్న వారికే టికెట్ కేటాయిస్తారని సమాచారం. అత్యధిక సీట్లు కైవసం చేసుకునే దిశగా రాష్ట్రంలో వైసీపీ మార్పులు చేర్పులు చేస్తోంది. రాష్ట్రంలో ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీని సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలుగా, నియోజకవర్గ ఇంచార్జులుగా ఉన్న వారిలో పనితీరు బాగాలేని, ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకున్న వారిని తన ఎన్నికల టీము నుంచి తొలగించేందుకు సిద్ధం అయ్యారు. 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. మొత్తానికి వ్యవహారం చూస్తుంటే వై నాట్ 175 లక్ష్యాన్ని చేరుకునేలానే కనిపిస్తున్నారు.