నో డౌట్ వైసీపీదే అధికారం.. జగన్ సంచలన ట్వీట్

నో డౌట్ వైసీపీదే అధికారం.. జగన్ సంచలన ట్వీట్

ఏపీలో ఎన్నికల ఫలితాలు మరో ఐదు రోజుల్లో వెలువడనున్నాయి. కూటమికి గెలుపుపై ఎంత ధీమా ఉందో తెలియదు కానీ వైసీపీకి పూర్తి స్థాయిలో తప్పక గెలుస్తామనే నమ్మకముంది. ఆ నమ్మకంతోనే ఇప్పటికే ప్రమాణ స్వీకారానికి తేదీతో పాటు టైమ్ కూడా ఫిక్స్ చేశారు. జూన్ 9న ప్రమాణ స్వీకారానికి డేట్ ఫిక్స్ చేసింది. అలాగే వైజాగ్‌లో సీఎంగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారని వైసీపీ వర్గాలు తెలిపాయి. ఇక జగన్మోహన్ రెడ్డి సైతం నేడు ట్విటర్ వేదికగా.. వైసీపీ అధికారంలోకి రాబోతోందంటూ ట్వీట్ చేశారు. 

‘‘దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజన మన పార్టీ అధికారంలోకి వచ్చింది. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికీ మంచి చేసింది. ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటుకానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకేస్తుంది’’ అని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మరో రెండు రోజుల్లో ఎగ్జిట్ పోల్స్ కూడా వెలువడనున్నాయి. ఈ సమయంలో జగన్ ఇలాంటి ప్రకటన చేయడంతో వైసీపీ కార్యకర్తలు, నేతలు ఫుల్ జోష్‌లో ఉన్నారు.

ఇప్పటికే వెలువడిన సర్వేలన్నీ వైసీపీకి అనుకూలంగానే ఉన్నాయి. సీట్లు ఏమైనా తగ్గితే తగ్గొచ్చేమో కానీ వైసీపీ అధికారంలోకి రావడం పక్కా అని చెబుతున్నాయి. ఇప్పుడు జగన్ కూడా ప్రజలందరి దీవెనలతో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు స్పష్టం చేశారు. మహిళా ఓటు బ్యాంకు పెరగడమనేది ఆ పార్టీకి బాగా కలిసొస్తుందనడంలో సందేహమే లేదు. సంక్షేమ పథకాల లబ్ది దారులు ఇంటింటికీ ఉన్నారు. కాబట్టి ఇది కూడా ఆ పార్టీ బాగా కలిసొచ్చే అంశం. ఈ క్రమంలోనే వైసీపీకి ప్రజల అండ బాగానే లభించిందని చెప్పాలి.