సామాజిక సాధికారతే లక్ష్యంగా వైసీపీ ఇన్‌చార్జుల రెండో జాబితా..
వైసీపీ ఎన్నికలకు శరవేగంగా సమాయత్తమవుతోంది. ఈ క్రమంలోనే గెలుపే లక్ష్యంగా ఇన్‌చార్జులను ఎంపిక చేస్తోంది. సామాజిక సాధికారతకు పెద్ద పీట వేస్తూ ఏపీ సీఎం వైఎస్ జగన్ నియోజకవర్గ ఇన్‌చార్జులకు సంబంధించిన రెండో జాబితాను విడుదల చేయడం జరిగింది. ఈ క్రమంలోనే కొన్ని చోట్ల కొత్తవారికి అవకాశం కల్పించగా.. మరికొన్ని చోట్ల నేతలకు స్థానచలనం కల్పించారు. మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ బీసీలకు ఈ జాబితాలో తగిన ప్రాధాన్యం ఇచ్చారు. రాజమండ్రి ఎంపీగా ఉన్న మార్గాని భరత్ ను రాజమండ్రి సిటీకీ మార్చారు. అలాగే మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ ను రామచంద్రాపురం నుంచి రాజమండ్రి రూరల్‌కు మార్చారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావును విజయవాడ సెంట్రల్‌కు మార్చారు. ఇక వెల్లంపల్లి స్థానంలో మైనార్టీకి చెందిన షేక్ ఆసిఫ్ కు అవకాశమిచ్చారు. ఈసారి కొందరి వారసులకు జగన్ అవకాశం కల్పించారు.
వారసులొచ్చారు..
మచిలీ పట్నం నుంచి పేర్ని నాని తనయుడు పేర్ని కృష్టమూర్తికి, చంద్రగిరి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి , రామచంద్రాపురం నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు పిల్లి సూర్యప్రకాష్ కు అవకాశం కల్పించారు. ఇక అలాగే ఈసారి మహిళలకు కూడా బాగానే అవకాశం కల్పించారు. పోలవరం నుంచి తెల్లం బాలరాజు సతీమణి తెల్లం రాజ్యలక్ష్మికి.. తూర్పు గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యమిస్తూ పిఠాపురం నుంచి వంగ గీత, జగ్గంపేట నుంచి తోట నరసింహం, ప్రత్తిపాడు నుంచి వరుపుల సుబ్బారావులకు అవకాశం కల్పించారు.
ఎస్సీ సామాజికవర్గం నుంచి..
ఇక రెండో లిస్ట్‌లో మైనార్టీలకు సైతం మంచి అవకాశం కల్పించారు. విజయవాడ వెస్ట్ నుంచి షేక్ ఆసిఫ్, గుంటూరు ఈస్ట్ నుంచి షేక్ నూరి ఫాతిమా, కదిరి నుంచి బియస్.మక్బూల్ అహ్మద్ లకు అవకాశం కల్పించారు. ఇక ఎస్సీ, ఎస్టీలకు సైతం మంచి ప్రాధాన్యం కల్పించారు. ఎస్సీ సామాజిక వర్గం విషయానికి వస్తే.. పాయకరావు పేట నుంచి కంబాల జోగులు, పి.గన్నవరం నుంచి విప్పర్తి వేణుగోపాల్, ఎర్రగొండపాలెం నుంచి తాటిపర్తి చంద్రశేఖర్‌లకు అవకాశం కల్పించారు. ఎస్టీ సామాజికవర్గం నుంచి అరకు ఎంపీ స్థానానికి కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి, పోలవరం నుంచి తెల్లం రాజ్యలక్ష్మిలకు అవకాశం కల్పించారు.బీసీల విషయానికి వస్తే.. మార్గాని భరత్, మలసాల భరత్ కుమార్, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, పిల్లి సూర్యప్రకాష్ లకు అవకాశం కల్పించారు.
మాటల్లోనూ కాదు.. చేతల్లోనూ..
వైశ్య సామాజిక వర్గం నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు జగన్ అవకాశం కల్పించారు. తొలి జాబితాలో పదకొండు మంది, రెండో జాబితాలో 27 మందిని నియోజకవర్గ ఇన్ చార్జీలుగా నియమించారు. రెండు జాబితాలు కలిపి మొత్తం 38 మందిని నియమించారు. దాదాపు ఈ రెండు జాబితాల్లో ప్రతి ఒక్క సామాజిక వర్గానికీ అవకాశం కల్పించారు. అయితే వివిధ కారణాలతో స్థానం కోల్పోయిన వారికి నామినేటెడ్ పోస్టుల్లో నియమిస్తామని జగన్ తెలిపారు. ఇన్‌చార్జుల ఎంపిక తీరు తెన్నులను జగన్ వివరించారు. సామాజికవర్గాలకు న్యాయం జరిగేలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సమ ప్రాధాన్యం ఇస్తూ ఈ ఇన్‌ఛార్జిల ఎంపిక జరిగింది. జగన్ మాటల్లోనే కాదు.. చేతల్లో కూడా సామాజిక న్యాయం చూపించారు జగన్.