చిరంజీవి కామెంట్ల దుమారం: విరుచుకుపడుతున్న వైసీపీ నేతలు

నిన్నటి వరకు పవన్.. ఇప్పుడిక చిరును బంతాట ఆడుతున్న వైసీపీ..!

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘బ్రో’ సినిమాలో ఇమిటేషన్‌తో మొదలైన వివాదం రెమ్యునరేషన్ వరకూ వెళ్లింది. దీంతో తమ్ముడిని పదే పదే టార్గెట్ చేయడంతో రియల్ లైఫ్ బ్రో మెగాస్టార్ చిరు రంగంలోకి దిగారు. పిచ్చుకపై బ్రహ్మాస్త్రాలు మాని.. అభివృద్ధి, సంక్షేమంపై దృష్టిపెట్టాలని జగన్ సర్కార్‌కు ఉచిత సలహాలిచ్చారు. ప్రభుత్వంపై చిరు చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. ప్రభుత్వానికే సలహాలు, సూచనలు ఇచ్చే పరిస్థితులో మీరున్నారా..? అంటూ ఇవాళ ఉదయం నుంచి మంత్రులు, మాజీ మంత్రులు, వైసీపీ నేతలు మీడియా ముందుకొచ్చి దుమ్ముదులిపి వదులుతున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని.. మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు స్పందించారు.

నేను అభిమానినే కానీ..!

‘నేను వ్యక్తిగతంగా చిరంజీవికి అభిమానిని. ఇక్కడే కాదు.. పక్క రాష్ట్రంలో కూడా ఇంజనీరింగ్‌ చదువుతూ సినిమాహాళ్ల వద్ద చిరంజీవి బోర్డులు, పోస్టర్లకు దండలు వేశాం. హైదరాబాద్‌ ఫిల్మ్‌ నగర్‌ నుంచి, అమరావతిలోని సచివాలయం ఎంత దూరమో.. ఇక్కణ్నుంచి అక్కడికి కూడా.. సరిగ్గా అంతే దూరం ఉంటుంది. ఎక్కువ, తక్కువ రాదని నా హీరోకు చెబుతున్నాను. చిరంజీవిగారిని ఒకటే కోరుతున్నాను. సినిమాను ఎవరైనా సినిమాగా చూడాలి. రాజకీయాన్ని ఎవరైనా రాజకీయంగా చూడాలి. చిరంజీవిగారి మీద కానీ, రామ్‌చరణ్‌ మీద కానీ, ప్రభాస్‌ మీద కానీ, జూనియర్‌ ఎన్టీఆర్‌ మీద కానీ, రవితేజ మీద కానీ, మహేష్‌బాబు కానీ, చిరంజీవి గారి తమ్ముడి కుమారులు, మేనళ్లులు కానీ. బెజవాడ కుర్రోడు రామ్‌ మీద కానీ.. ఎవరి మీద అయినా, ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రోజైనా మాట్లాడిందా?. సినిమా రంగం వేరు.. గతంలో ఎవరూ, ఏ పార్టీ నాయకుడైనా వారి గురించి మాట్లాడారా? నటుల రెమ్యునరేషన్‌ గురించి ప్రస్తావిస్తారా?. అందుకే మీరు గిల్లినప్పుడు.. వారూ గిల్లించుకోక తప్పదు. కథకు సంబంధం లేకుండా, ఒక నేత పాత్రను ఒక నటుడితో పోషించినప్పుడు.. ఇలాగే అన్నీ వస్తాయి. బాహ్య ప్రపంచంలో ఎవరైనా సరే గిల్లితే.. వారికి గిల్లుడు తప్పదు. ఇది వారు గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ ఒక నేత, సంక్రాంతి పండగ రోజు ప్రజలతో మమేకం అవుతూ డ్యాన్స్‌ చేస్తే.. అదే డ్రెస్‌ను ఒక నటుడికి వేసి, కథకు సంబంధం లేకుండా నటుడి పాత్ర ప్రవేశపెట్టి.. ఆయనతో డ్యాన్స్‌ చేయించి, హేళనగా మాట్లాడి అవమానించారు. ఇక్కడ ఒక రాజకీయ నాయకుడిమీద కక్ష తీర్చుకోవడానికి అన్నట్లుగా పాత్రలు పెట్టి సృష్టించారు. కాబట్టి వారు ఎదుర్కోకతప్పదు’ అని చిరుకు పేర్ని నాని దిమ్మదిరిగే కౌంటరిచ్చారు.

బొత్స సత్యనారాయణ : సినీ పరిశ్రమ ఒక పిచుకా అని ఒప్పుకున్నారా? చిరంజీవి చెప్పాలి. ఏపీలో సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి. చిరంజీవి ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశారో చెప్పాలి..?. ప్రతి సమస్యపై ప్రభుత్వం స్పందిస్తోంది. చిరంజీవి వ్యాఖ్యలను చూసిన తరువాత పూర్తిస్థాయిలో స్పందిస్తాను.

కొడాలి నాని : సినీ పరిశ్రమలో పకోడీగాళ్ళకు సలహాలు చెప్పాలని సూచన. ప్రభుత్వానికి నీ సలహాలు అవసరం లేదు. సినీ పరిశ్రమలో కొందరు పకోడీగాళ్ళు ఉన్నారు. ప్రభుత్వం ఎలా ఉండాలో వాళ్ళు చెబుతున్నారు. ఆ పకోడీగాళ్లకు సలహాలు ఇస్తే బాగుంటుంది. రాజకీయాలు ఎందుకు?.. డాన్సులు, ఫైట్స్‌, యాక్షన్‌.. చూసుకుంటే బాగుంటుందని వాళ్లకు చెప్పొచ్చు కదా..?

గుడివాడ అమర్నాథ్ : చిరంజీవి మాకు సలహాలు ఇచ్చే ముందు వాళ్ల తమ్ముడికి చెబితే బాగుంటుంది. వాళ్ల తమ్ముడికి చెప్పిన తర్వాత ప్రభుత్వానికి సలహాలిస్తే బాగుంటుంది. వారంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. సినిమాల్లోకి రాజకీయాలను తీసుకువచ్చింది ఎవరో చెప్పండి. రాంబాబుని ఒక క్యారెక్టర్‌గా పెట్టారు. దానిపై ఎందుకు మాట్లాడరు.

మరోవైపు.. వైసీపీ నేతల వ్యాఖ్యలతో మెగాభిమానులు, జనసేన నేతలు, కార్యకర్తలు రగిలిపోతున్నారు. నూజివీడులో కొడాలి నాని, గుడివాడ అమర్నాథ్, పేర్ని నాని ఫోటోలను చించి, కాళ్ళతో తొక్కిన మెగాభిమానులు తగలబెట్టారు. చిరంజీవికి క్షమాపణలు చెప్పకుంటే రాష్ట్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతాయంటూ అభిమాన సంఘాలు వార్నింగ్ ఇస్తున్నాయి. రక్తదానం, నేత్ర దానం వంటి స్వచ్చంద కార్యక్రమాలు చేపడుతూ.. సినీ కార్మికులకు అండగా ఉంటూన్న మహోన్నత వ్యక్తి చిరంజీవిపై నోరుజారడం.. వైసీపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అని వీరాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. 2024 ఎన్నికలలో వైసీపీ ఓటమికి భాద్యత తీసుకుంటామని చిరు అభిమానులు ఛాలెంజ్ చేశారు. మొత్తానికి చూస్తే.. నిన్న మొన్నటి వరకూ పవన్ కల్యాణ్‌ను ఆడుకున్న వైసీపీ.. ఇప్పుడు చిరును బంతాట ఆడుకుంటోంది. ఈ వ్యవహారానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి మరి.

Google News