భూమా అఖిలప్రియకు వ్యతిరేకంగా రంగంలోకి వైసీపీ మహిళా నేత
ఏపీలో ఎన్నికలకు అన్ని పార్టీలూ సమాయత్తమవుతున్నాయి. వైసీపీ గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో కసరత్తు నిర్వహిస్తోంది. కొందరు ఎమ్మెల్యే అభ్యర్థులను తప్పిస్తోంది. మరికొందరికి స్థానాలను మారుస్తోంది. ఈ క్రమంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంపై కూడా వైసీపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఆళ్లగడ్డలో రెండు సమస్యలను వైసీపీ గుర్తించింది. ఒకటేంటంటే.. అక్కడ వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే బ్రిజేందర్ రెడ్డి (నాని) వ్యతిరేకంగా సర్వే రావడం.
మరొకటి భూమా అఖిల ప్రియను ఎదుర్కోవడం వైసీపీకి చాలా కష్టంగా మారింది. ఈ రెండు సమస్యలకు ఉపశమనం వెదికిన వైసీపీ ఒక మహిళా నేతను రంగంలోకి దింపిందని టాక్. సరిగ్గా ఎన్నికల ముందే సదరు మహిళా నేత రాజకీయాల్లో యాక్టివ్ అవడం.. నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం వంటివి ఈ వార్తకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇంతకూ ఆ మహిళ మరెవరో కాదు.. ఎమ్మెల్యే నాని సోదరి అవంతి రెడ్డి. ఈమె గత కొద్ది రోజులుగా ఆళ్లగడ్డలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
వైసీపీ ఎమ్మెల్యే అధికారంలో ఉన్నా కూడా భూమా అఖిలప్రియ ఫ్యామిలీని అడ్డుకుని నిలవడం కష్టంగా మారిందని టాక్. నిజానికి అఖిలప్రియ కుటుంబం బీభత్సంగా అవినీతిలో కూరుకుపోయిందనే ఆరోపణలు ఉన్నాయి. భూ ఆక్రమణల నుంచి కిడ్నాప్‌ల వరకూ ఈ కుటుంబంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయినా సరే.. అఖిల ప్రియకు ఎదురు నిలవడం కష్టంగా మారిందట. ఈ క్రమంలోనే నాని సొంత అక్క అవంతి రెడ్డిని వైసీపీ సీన్‌లోకి ప్రవేశ పెట్టింది. ఇక ఆమెను నానియే స్వయంగా తీసుకెళ్లి సీఎం జగన్‌కు పరిచయం చేశారట.