‘వ్యూహం’ రివ్యూ: పొలిటికల్ పంచ్

‘వ్యూహం’ రివ్యూ: నిండు జీవితాన్ని కళ్ల ముందు ఆవిష్కరణ

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వ్యూహం’. అజ్మల్ అమీర్, మానస రాధాకృష్ణన్, వాసు ఇంటూరి, సురభి ప్రభావతి, ఎలీనా టుటేజా, ధనంజయ్ ప్రభునే తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి మరణానంతరం పడిన బాధలు, కష్టాలు.. అధికారాన్ని దక్కించుకోవడం వంటి అంశాలతో ఈ చిత్రం రూపొందింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా? అసలు సినిమా ఎలా ఉంది? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం.

సినిమా కథ ఏంటంటే..

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంతో సినిమా మొదలవుతుంది. అలాగే జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో సినిమాకు ఎండ్ కార్డ్ పడుతుంది. ఈ మధ్యలో ఏం జరిగిందనే విషయాలను రామ్ గోపాల్ వర్మ కళ్లకు కట్టినట్టుగా చూపించారు.చంద్రబాబు పాత్రధారి అంతగా సెట్ కాకున్నా.. ఆ పాత్రను ఆర్జీవీ చక్కగానే చూపించారు. పాత్రల పేర్లు మారినా కానీ ఆ పాత్ర ఎవరికి సంబంధించినదనేది క్లియర్‌గానే తెలుస్తుంది. తండ్రి అడుగుజాడల్లో నడవాలని జగన్ రాజకీయ ఆరంగేట్రం చేస్తారు. ఆపై కడప ఎంపీగా విజయం సాధించారు. ఆ తరువాత హెలికాఫ్టర్ ప్రమాదంలో వైఎస్ మరణిస్తారు. అక్కడి నుంచి అసలు కథ ప్రారంభమవుతుంది.

‘వ్యూహం’ రివ్యూ: నిండు జీవితాన్ని కళ్ల ముందు ఆవిష్కరణ

ఏపీకి సీఎం ఎవరనే ప్రశ్నలు తలెత్తడంతో జగన్ ముఖ్యమంత్రి కావాలంటూ 150 మందికి పైగా ఎమ్మెల్యులు సంతకాలు చేసి ఒక లేఖను కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియాకు అందజేస్తారు. ఆ సమయంలో జగన్‌ను సీఎం కాకుండా చంద్రబాబు ఎలా అడ్డుకున్నారు? ఆ అవరోధాలన్నింటినీ దాటుకుని జగన్ సీఎం ఎలా అయ్యారనేది కథ. ఈ సినిమాలో జనసేన అధినేత పవన్‌తో పాటు నారా లోకేష్ పాత్రలను ఆర్జీవీ కాస్త కామెడీ యాంగిల్‌లో చూపించారు. జగన్ ఓదార్పు యాత్ర చేయడం వంటి అంశాలను వర్మ చక్కగా చూపించారు. ఎమోషన్ కూడా బాగానే పండింది. ఈ సినిమాలో పాత్రలను రాజకీయ కోణంలోనే కాకుండా వ్యక్తిగతంగానూ వర్మ తీర్చిదిద్దిన తీరు అద్భుతం. ముఖ్యంగా జగన్‌కు కష్ట సమయంలో ఆయన తల్లి, భార్య ఎలా అండగా నిలిచారనేది చక్కగా చూపించారు. షర్మిల పాత్రకు వర్మ అయితే ప్రాధాన్యమివ్వలేదనే చెప్పాలి.

సినిమాలో ప్లస్.. మైనస్‌లు..

ఇక వ్యూహం సినిమా మొత్తం జగన్, చంద్రబాబుల మధ్యే తిరుగుతూ ఉంటుంది. ఎందుకోగానీ వర్మ పవన్ కల్యాణ్ పాత్రకు కాస్త ఎక్కువగానే ప్రాధాన్యమిచ్చారు. ఇక అజ్మల్ అమీర్ వచ్చేసి గతంలోనూ జగన్ పాత్రలో నటించి ఉన్నారు కాబట్టి ఆయన పాత్రను హావభావాలతో దించేశారు. జగన్ పాత్రను అజ్మల్ అమీర్ తప్ప మరొకరు చేయలేరన్నట్టుగా చేశాడని చెప్పాలి. ఇక వైఎస్ భారతి పాత్రలో నటించిన మానస రాధాకృష్ణన్ కొంత వరకూ భారతి మాదిరిగానే కనిపించారు. అద్భుతంగా సెట్ అయ్యారు. ఇక చంద్రబాబు పాత్రధారి మాత్రం సరిగా నప్పలేదనే చెప్పాలి. నటన పరంగా మాత్రం బాగా చేశారు.జగన్ పార్టీ పెట్టిన సమయంలో వచ్చిన పాట ఆకట్టుకుంది. సంగీతం, పాటలు మినహా సినిమా అయితే తెరపై నిండు జీవితాన్ని ఆవిష్కరించింది. మొత్తానికి వ్యూహం సినిమా అలరిస్తుందనడంలో సందేహం లేదు.

Rating: ***

Google News