Medaram Jathara: మేడారం జాతరలో ఇలా ఎందుకు చేస్తారో తెలుసా?
మేడారం జాతరను తెలంగాణ కుంభమేళాతో పోలుస్తుంటాం. అసలు ఆ మాటకొస్తే.. ఆసియాఖండంలోనే అతిపెద్ద జాతర సమ్మక్క-సారక్క జాతర. రెండేళ్లకి ఓసారి ఈ జాతర జరుగుతూ ఉంటుంది. వరంగల్ పట్నానికి వంద కిలోమీటర్ల దూరంలో మేడారం అనే పల్లెటూరు ఉంది. అక్కడే ఈ జాతర జరుగుతోంది. వన బిడ్డలను పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి వనదేవతలను దర్శించుకుంటున్నారు. ఈ జాతరకు మన రాష్ట్రం నుంచే కాకుండా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు.
అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పిస్తున్నారు. బెల్లాన్ని బంగారంగా పిలుస్తుంటారు. నిలువెత్తు బంగారం సమర్పించడమే ఒక విశేషమైతే.. మరో విశేషం కూడా ఉంది. ఇక్కడ పెద్ద ఎత్తున కోళ్లు, మేకలను బలి ఇస్తూ ఉంటారు. ఇక విశేషమేంటంటే.. ఇక్కడ అమ్మవార్ల ఎదుట కోళ్లను గాల్లోకి ఎగురవేస్తుంటారు. అసలు ఎందుకు ఇలా చేస్తుంటారనేది అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. మరి ఎందుకు ఇలా ఎగురవేస్తుంటారు? దీని వెనుక కారణమేంటి?
భక్తులు అమ్మవార్లకు మొక్కిన మొక్కుల మేరకు బంగారంతో పాటు కోళ్లు, మేకలు, గొర్రెల వంటివి బలి ఇస్తూ ఉంటారు. అయితే చిలకల గుట్ట నుంచి గద్దె మీదకు వచ్చే వరకూ అమ్మవారు ఉగ్రరూపంతో ఉంటారట. అమ్మవారిని శాంత పరచడం కోసమే తమ మొక్కులను అమ్మవారికి ఎదురు చూపిస్తూ కోళ్లను గాల్లోకి ఎగురవేస్తారట. ఇది ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోందని అక్కడి వారంతా చెబుతూ ఉంటారు.