Amitabh Bachchan: ప్రభాస్ షూటింగ్‌లో అమితాబ్‌కు గాయాలు.. కదిలినా, ఊపిరి తీసుకున్నా నొప్పేనంటూ పోస్ట్..
సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) కి ప్రాజెక్ట్ కె (Project K) షూటింగ్‌లో గాయాలయ్యాయి. ప్రభాస్ (Prabhas) ప్రధాన పాత్రలో తెరకెక్కతున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో అమితాబ్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఈ షూటింగ్‌లోనే అమితాబ్ (Amitabh Bachchan)కు గాయాలయ్యాయి. ఆయనకి గాయాలు కావడంతో పాటు పక్కటెముకల వద్ద గాయం అయినట్టు తెలుస్తోంది. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం ఏఐజీ ఆసుపత్రికి తరలించారు.
ఏఐజీ హాస్పిటల్‌లో ప్రాథమిక చికిత్స అనంతరం బిగ్‌బీ ముంబైకి తిరిగి వెళ్లిపోయారు. నాలుగు రోజుల క్రితమే జరిగిన ఈ ప్రమాదం ఆలస్యంగా వెలుగు చూసింది. అమితాబ్ (Amitabh Bachchan) తన బ్లాగ్ ద్వారా విషయం వెల్లడించారు. హైదరాబాద్‌లో ప్రాజెక్టు కే కోసం షూటింగ్ చేస్తున్న సమయంలో ఒక యాక్షన్ సీక్వెన్స్‌లో నటించాల్సి వచ్చిందన్నారు. ఈ సన్నివేశంలో నటిస్తుండగానే.. పక్కటెముక మృదులాస్థి పాపింగ్ విరిగిందని, కుడి పక్కటెముకకు కండరాలు చిరిగిపోయాయని అందుకే షూటింగ్ క్యాన్సిల్ చేసుకున్నట్టు అమితాబ్ తెలిపారు.
అయితే వైద్యులు ఆయనకు రెండు వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు తెలుస్తోంది. తన గాయాలకు వైద్యులు కట్లు కట్టారని.. ప్రస్తుతానికి రెస్ట్ తీసుకోమని చెప్పారన్నారు. అయితే పక్కటెముకల వద్ద గాయమవడంతో కదులుతున్నప్పుడు, ఊపిరి తీసుకుంటున్నప్పుడు బాధగా ఉంటోందని వెల్లడించారు. అంతా నార్మల్ అయ్యేందుకు కొన్ని వారాలు పడుతుందని డాక్టర్లు చెప్పారని అమితాబ్ (Amitabh Bachchan) వెల్లడించారు. ఇక ఈ రోజు సాయంత్రం జల్సా గేటు వద్ద ఎవరినీ కలవలేనని తన కోసం ఎవరూ రావద్దని తెలిపారు.